రెమాల్ తుపాన్ కు ఆ పేరు ఎలా వచ్చింది?

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుపానులకు పేర్లు పెట్టే విధానం ప్రకారంగా ఈ తుపానుకు రెమాల్ అని నామకరణం చేశారు

Update: 2024-05-26 14:04 GMT

రెమాల్ తుపాన్ కు ఆ పేరు ఎలా వచ్చింది?


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడింది. ఈ తుపాన్ కు రెమాల్ అని నామకరణం చేశారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని మే 26న రెమాల్ తుపాన్ తాకనుంది. తీరం దాటకముందే ఇది తీవ్ర తుపాన్ గా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.పశ్చిమబెంగాల్ లోని సాగర ద్వీపం, ఖేపపురా మధ్య ఆదివారం నాడు రేమాల్ తుపాన్ తీరాన్ని దాటనుంది.ఈ రుతుపవనాల సీజన్ లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుపాన్ రెమాల్.

రెమాల్ కు ఆ పేరు ఎలా వచ్చింది?

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుపానులకు పేర్లు పెట్టే విధానం ప్రకారంగా ఈ తుపానుకు రెమాల్ అని నామకరణం చేశారు.అరబిక్ భాషలో ఇసుక అని అర్ధం వచ్చే ఈ తుపాన్ కు రెమాల్ అని ఒమన్ పేరు పెట్టింది.

తుపాన్ లకు పేర్లు ఎలా పెడతారు?

ప్రపంచంలోని ఆరు వాతావరణ కేంద్రాలు వాతావరణంపై పరిశోధనలు చేసి తుపాన్ హెచ్చరికలు,సూచనలు జారీ చేస్తాయి. అంతేకాదు తుపాన్లకు పేర్లు కూడా పెడతాయి. 2000లో మస్కట్, ఓమన్ దేశాల్లో జరిగిన సదస్సులో తుపాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపాన్లకు సంబంధించి పేర్లు పెట్టాలనే ఒప్పందం కుదిరింది.

2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో నార్త్ ఇండియన్ జోన్ లోని ఇండియా సహా ఎనిమిది దేశాలు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలో ప్రతి దేశం నుండి ఎనిమిది పేర్లను ఇచ్చాయి. అక్షర మాల ప్రకారంగా ఒక్కో దేశం ఓ తుపానుకు పేరును సూచిస్తుంది. తుపాన్ పేరు ఎనిమిది అక్షరాలకు మించకూడదు. తుపాన్ పేరుపై సభ్యదేశాలకు అభ్యంతరం ఉండకూడదు.అంతేకాదు ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలనే నిబంధనలు కూడ ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తుపాన్లకు పేర్లు పెడతారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం

రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.బెంగాల్ రాష్ట్రంతోపాటు ఉత్తర ఒడిశాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించారు.మిజోరం, త్రిపుర, దక్షిణ మణిపూర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Tags:    

Similar News