Tamil Nadu: తమిళనాడు సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
Tamil Nadu: తమిళనాడు ఎగ్మూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసిన ఆగంతకుడు సీఎం స్టాలిన్ ఇంటిని పేల్చేయబోతున్నట్టు చెప్పాడు.
Tamil Nadu: పదేళ్ల నిరీక్షణ తర్వాత సీఎం అయ్యారు. మంచి మెజారిటీతో గెలిచారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన ఆనందం ఆవిరి కాకముందే షాకిచ్చాడో అగంతకుడు. డీఎంకె నేత స్టాలిన్ అన్ని ఆటంకాలను దాటుకుని సీఎం అయిన ఆనందంలో ఉండగా.. ఆయన ఇంటిలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అందరూ షాకయ్యారు. తనిఖీల్లో బాంబు లేదని తేలింది. కాని ఫోన్ చేసిన వ్యక్తెవరో తెలుసుకుని మరింత షాకయ్యారు.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఎగ్మూరులోని పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ చేసిన ఆగంతకుడు స్టాలిన్ ఇంటిని పేల్చేయబోతున్నట్టు చెప్పాడు. అల్వార్‌పేట చిత్తరంజన్ వీధిలోని ముఖ్యమంత్రి ఇంటిలో బాంబు పెట్టినట్టు చెప్పాడు. మరికాసేపట్లో బాంబు పేలబోతోందని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఫోన్ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ నిపుణులు, జాగిలంతో సీఎం ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించకపోవడంతో ఫేక్ కాల్ అని నిర్ధారించారు. ఫోన్‌కాల్ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఫోన్ కాల్ విల్లుపురం జిల్లా మరక్కాణం నుంచి వచ్చిదని, భువనేశ్వర్ (26) అనే యువకుడు ఫోన్ చేసినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడు మతిస్థిమితం కోల్పోయినట్టు గుర్తించారు. తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి వదిలేశారు.