నాట్య మయూరి.. ఆమె నృత్యం అమేయం! విశాఖ చిన్నారి అమేయ గురించి మీకు తెలుసా..?
నాలుగేళ్ళ వయసులోనే కాలికి గజ్జెకట్టింది...! ఆరేళ్ళకల్లా రెండున్నర గంటలకు పైగా ఏకధాటిగా నృత్యం చేసి అబ్బురపరచింది...! పదేళ్ళు వచ్చేసరికి దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది...! శాస్త్రీయ నృత్యకళాకారిణిగా ప్రశంసలందుకుంటున్న అమేయ లగుడు, ప్రధానమంత్రి బాల పురస్కార్ కు ఎంపికయింది.
విశాఖకు చెందిన లగుడు అమేయ అటు చదువులో ఇటు సాంప్రదాయ నృత్యంలోను ప్రతిభను కనబరుస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 100కుపైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనతను సొంతం చేసుకుంది. ఉన్నత శిఖరాలను అదిరోహించే దిశగా పయనం మవుతుంది. తనకు చిన్నప్పటి నుంచి సంగీతం, నృత్యం అంటే ఎంతో ఇష్టమని ఆ ఆసక్తే ఇప్పుడు జాతీయ స్థాయిలో చిన్నారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారానికి తాను ఎంపిక కావడానికి దోహదం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అమేయ అన్నాది.
ఆమేయలో టాలెంట్ జాతీయా స్థాయికే పరిమితమైపోలేదు. నేపాల్‌లో ప్రసిద్ధ పశుపతినాథ్ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చే ప్రదర్శనలో నృత్యం చేసే అవకాశం కల్పించారు. ఆ రోజు లక్షల మంది సమక్షంలో తన ప్రతిభను చాటుకునే అవకాశం దక్కిందని సగర్వంగా చెప్పుకుంది. విశాఖతో పాటు దేశ, విదేశాల్లో వందకు పైగా ప్రదర్శనలిచ్చిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
సంగీతం, నృత్యం మన దేశ వారసత్వ సంపదలు. కళలు, సంస్కృతి-సంప్రదాయాలు, విలువలు, నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని, కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసేందుకు కృషిచేయాలని కళాకారులకు పలువురు ప్రముఖులు ప్రోహత్సహిస్తున్నారు.