Karnataka Hijab Issue: హిజాబ్‌పై నిషేదాన్ని ఎత్తేసిన కాంగ్రెస్ సర్కార్
Karnataka Hijab Issue: కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసిన హిబాబ్ అంశం
Karnataka Hijab Issue: కర్ణాటకలో మళ్లీ హిజాబ్ హీట్ రాజుకుంది. హిజాబ్‌పై గతంలో బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేదాన్ని..ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమకు నచ్చిన దుస్తులను మహిళలు ధరించవచ్చని సీఎం సిద్ధ రామయ్య తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు..? ఏం తింటారు..? అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ నిర్ణయాన్ని.. ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
కర్ణాటకలో బసవరాజు బొమ్మై నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం 2022లో హిజాబ్‌పై బ్యాన్ విధించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించొద్దని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో అందరూ సమానం అనే స్ఫూర్తికి హిజాబ్ విఘాతం కల్గిస్తుందని పేర్కొంది. అటు ముస్లిం సంఘాలు మాత్రం.. ఇది తమ మతపరమైన అంశంగా వాధించాయి. అప్పట్లో హిజాబ్ అంశం..కర్ణాటకలో రాజకీయ కాక రేపింది. రెండు సామాజికవర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. రాజకీయ రచ్చ రాజేసిన ఈ అంశంపై..గతంలో కర్ణాటక సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది.
హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరి ధరించాలన్న నియమం ఏం లేదని చెప్పింది. విద్యా సంస్థల్లో అందరూ ఒకేరకమైన దుస్తులు ధరించాలని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఐతే కేసు కోర్టులో ఉండగానే.. తాజా కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఓ సామాజిక వర్గం స్వాగతిస్తుండగా.. బీజేపీ ఫైర్ అవుతోంది.