ఇంగ్లాండ్‌లో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు
* వేల్స్‌లో ప్రతి 60 మందిలో ఒకరికి పాజిటివ్ * ఇంగ్లాండ్‌లో ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా * కరోనా కొత్త రకం గురించి బ్రిటన్, దక్షిణాఫ్రికా మధ్య మాటల యుద్ధం * నెగిటివ్ వస్తనే అమెరికాలోకి ఎంట్రీ
యూకేలో విస్తరిస్తోన్న కొవిడ్ కొత్త ఉత్పరివర్తనం కంటే.. దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ రకం చాలా ప్రమాదకరమని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మట్ హాంకాక్ చేసిన ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి కౌంటర్‌గా దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జ్వెలిని స్పందించారు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో విస్తరిస్తున్న 501 వీ 2 రకం కరోనా వైరస్.. యూకేలో విస్తరిస్తున్న కొత్త రకం కంటే ప్రమాదకరమైనది అని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవని జ్వెలిని స్పష్టం చేశారు..
మరోవైపు ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వేగంగా దూసుకొస్తుంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లోనే లక్షా 73వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 58శాతం అధికంగా ఉన్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా వారం రోజుల్లోనే ఇన్ని కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. వేల్స్ లో ప్రతి 60 మందిలో ఒకరికి, ఇంగ్లాండ్‌లో ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. కరోనా కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలకమైన ప్రాంతాల్లో టైర్ -4 ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.
బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. కరోనా నెగిటివ్‌గా తేలినవారినే తమ దేశంలోకి అనుమతిస్తామని అమెరికా పేర్కొంది. విమాన ప్రయాణానికి 3 రోజుల ముందే పరీక్షలు చేయించుకోవాలని, సంబంధిత రిపోర్టును విమానయాన సంస్థకు అందజేయాలని సూచించింది.