పిల్లర్లపై హైస్పీడ్ రైలు?
* జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్ కారిడార్ * హైదరాబాద్-ముంబయి సహా 7 మార్గాల్లో ఇదే పద్ధతి * రైల్వేశాఖ తాజా ప్రతిపాదన
ముంబయి-పుణె-హైదరాబాద్ సహా హైస్పీడ్ కారిడార్ల విషయంలో రైల్వేశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రాజెక్టులను కొత్తగా భూమి సేకరించి కాకుండా ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది. జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్ రైల్ ప్లాన్) ముసాయిదాను కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రైల్వేశాఖ అందులో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేసింది. ముంబయి-హైదరాబాద్‌తో పాటు మొత్తం ఏడు కొత్త హైస్పీడ్ కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొంది.
హైస్పీడ్ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. గంటకు 320-350 కిమీ వేగంతో ప్రయాణించేలా హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టును రైల్వేశాఖ తీసుకువస్తోంది. ఇంత వేగంగా రైళ్లు ప్రయాణం చేయాలంటే.. దాన్ని తట్టుకునేలా ప్రత్యేకమైన ట్రాక్ ఉండాలి. అంటే ప్రస్తుత మార్గంలో ఉన్న ట్రాక్ కాకుండా కొత్తది నిర్మించాల్సి ఉంటుంది. దీనికి పెద్దమొత్తంలో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్య భూసేకరణే. ఇప్పటివరకు 68శాతమే భూసేకరణ జరిగింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ కొత్త హైస్పీడ్ కారిడార్లను జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది.
హైదరాబాద్ మెట్రోరైలును ఎలివేటెడ్ కారిడార్‌గానే నిర్మించారు. దీనివల్ల పెద్దగా భూసేకరణ లేకుండా ఉన్న రహదారి మధ్యలోనే పిల్లర్లు నిర్మించారు. హైస్పీడ్ కారిడార్‌లో పిల్లర్లను జాతీయ రహదారి మధ్యలో డివైడర్లు ఉన్న ప్రాంతంలో నిర్మిస్తారా? రహదారికి ఒకవైపా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ముంబయిలో స్థల సమస్య కారణంగా ఈ ప్రాజెక్టును నవీ ముంబయి వరకు పొడిగించి అక్కడ హైస్పీడ్ రైలు టెర్మినల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు కారిడార్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 2021 డిసెంబరులో రానుంది. అప్పుడు స్పష్టత వస్తుంది.
ముంబయి-హైదరాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.41 లక్షల కోట్లు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టును 2041-51లో చేపడతారు. రైలు ఆగే స్టేషన్లు.. నవీముంబయి/ముంబయి, లోనావాలా, పుణె, దౌండ్, అక్లుజ్, పంధార్‌పుర్, శోలాపుర్, కలబురిగి, జహీరాబాద్, హైదరాబాద్.