High Alert: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్

High Alert: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్‌ ఉందన్న నిఘా వర్గాలు * అప్రమత్తమైన తెలంగాణ పోలీస్‌ శాఖ

Update: 2021-08-14 04:00 GMT

దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

High Alert: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా విభాగం హెచ్చరికలతో తెలంగాణ పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీస్‌ ఉన్నతాధికారులు. అలాగే.. చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో ఆర్పీఎఫ్‌, సీఆర్పీఎఫ్, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర కేంద్ర బలగాలు, లోకల్‌ పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఎయిర్‌పోర్టులోకి అనుమతిస్తున్నారు. ఎవరైనా వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిణామాలు, డ్రోన్‌ కెమెరాలతో భారత సరిహద్దు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు పంపించడం, దర్బంగా బ్లాస్ట్‌ కేసు నిందితులు హైదరాబాద్‌కు చెందినవారు కావడంతో.. పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

ఇక ఆగస్టు 15 వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబయింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. గోల్కొండతో పాటు.. పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్‌లను ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నట్టు వెల్లడించారు. పాతబస్తీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నామన్నారు. కోవిడ్ నింభంధనలు పాటించి ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని కోరారు సీపీ అంజనీ కుమార్.

Full View


Tags:    

Similar News