Char Dham Yatra: 'చార్‌ధామ్ యాత్ర' కు మంచు తిప్పలు
Char Dham Yatra: ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన యాత్ర పనులు
Char Dham Yatra: ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రపై సందిగ్ధత నెలకొంది. రేపటి నుంచే యాత్ర ప్రారంభం అవుతుందన్న సమయంలో.. ప్రతికూల వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రేపు యాత్ర ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాత్ర రెండురోజుల్లో ప్రారంభం అవుతుందన్న సమయంలో విపరీతంగా మంచు కురవడంతో పాటు.. వర్షాలు పడుతున్నాయి. చార్‌ధామ్ ప్రాంతంలో రోడ్డుపై మంచు కూరుకుపోయింది.
దీంతో యాత్ర సన్నాహక పనులకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా పనులు కొనసాగించలేకపోతున్నారు. విపరీతమైన మంచు,వర్షాల కారణంగా రైళ‌్లు కూడా వెళ్లలేని పరిస్ధితి నెలకొంది. మరోవైపు మంచు, వర్షం, చల్లని గాలులతో చమోలీ, రుద్రప్రయాగ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
అయితే రేపటి నుంచే యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఈనెల 25న కేదార్‌నాథ్, ఈనెల 27న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం అసలు యాత్ర ప్రారంభం అవుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటు అధికారులు కూడా యాత్ర ప్రారంభం ఆలస్యం కానుందని సూచిస్తున్నారు.