భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం..కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్టాలిన్ సూచన
* ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో చాలాచోట్ల భారీ వర్షపాతం నమోదు అయింది
Chennai: భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో చాలాచోట్ల భారీ వర్షపాతం నమోదు అయింది. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. చెన్నైలోని రెడ్‌హిల్స్‌లో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైనే వర్షపు నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
24 గంటల నుంచి వర్షం పడుతుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో కాంచీపురంతో పాటు 8జిల్లాల్లో పాఠశాలలకు మంగళవారం ముందుస్తుగా సెలవు ప్రకటించారు. తమిళనాడులో 5వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని... చెన్నైతో పాటు 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కురుస్తుందని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. 3, 4 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో చాలాచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాలిట వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 5వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.