Heavy Rains: సౌత్ రాష్ట్రాలను వణికిస్తున్న వరుణుడు
Heavy Rains: ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానాలో భీకర వర్షాలు * వరదల్లో చిక్కుకున్న ఢిల్లీలోని పలు గల్లీలు
Heavy Rains: సౌత్ రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. రాత్రి నుంచి చిన్న గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి జమ్మూ వరకు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అన్ని రాష్ట్రాలకు వరుణుడు సమన్యాయం చేశాడు. కంటిన్యూగా వర్షం పడడంతో ఢిల్లీ గల్లీలు తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారాయి. రహదారులు వాగులను మరిపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రంతా జాగరం చేశారు.
హర్యానా గురుగ్రామ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఖావస్‌పూర్ గ్రామంలో కన్‌స్ట్రక్షన్ లో ఉన్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. ఆరుగురు కార్మికులు అందులో చిక్కుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి బయటకు తీసిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం నిర్మాణాత్మక లోపాల వల్ల జరిగింది వర్షాల వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
మరోవైపు మరో నాలుగురోజులపాటు ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 18 నుంచి 21 వరకు ఉత్తరాదిలోనూ, జూలై 23 వరకు పశ్చిమ తీరంలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.