Heavy Rains in Kerala: కేరళలో 2018కి మించిన వర్ష బీభత్సం

*ఐదు జిల్లాల్లో రెడ్, ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ *వరదల్లో ఐదుగురు మృతి.. పలువురు గల్లంతు

Update: 2021-10-17 02:29 GMT

కేరళలో 2018కి మించిన వర్ష బీభత్సం(ఫైల్ ఫోటో)

 Heavy Rains in Kerala: 2018 కేరళ ప్రళయ బీభత్సాన్ని ఒక్క ఆ రాష్ట్రమే కాదు యావత్ దేశం మరచిపోలేదు. మళ్లీ ఆ రోజులను గుర్తుచేస్తూ మరోసారి కేరళలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళను భారీ వర్షాలు, వరదలు ఉక్కిరి బిక్కరి చేసేస్తున్నాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన వర్షం అంతకంతకూ పెరుగుతూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను ముంచేసింది. భారీ వరదల ధాటికి ఇళ్లకు ఇళ్లే నీటమునిగాయంటే కేరళలో ప్రళయ బీభత్సం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

భారీ వర్షాలతో కేరళలోని గ్రామాలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్లకు ఇళ్లే నీటమునిగిన దృశ్యాలు కేరళలోని దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఓ వైపు వరదలతో సతమతమవుతున్న వేళ హిల్ స్టేషన్లలో విరిగిపడుతున్న కొండచరియలు స్థానికుల్ని మింగేస్తున్నాయి. కేరళలోని పతనమిట్టలో కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు మృతి చెందగా, 13 మంది గల్లంతైపోయారు. పతనిమిట్టలోని కూటిక్కల్ పంచాయతీలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో కనీసం 13మంది కనిపించకుండా పోయారు. ఇదే సమయంలో తొడుప్పుజాలో కారు కొట్టుకుపోవడంతో ఒక బాలిక మరణించింది.

భారీ వర్షాలతో తిరువనంతపురం జిల్లాలోని ప్రధాన డ్యామ్‌లు పూర్తిగా నిండుకున్నాయి. ఎటుచూసినా నీళ్లే నిండి ఉండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తిరువనంతపురంలోని అరట్టు కడవు వద్ద ఇళ్లు మరియు వరి పొలాలు వర్షాల కారణంగా నీట మునిగిపోయాయి. వివిధ డ్యామ్‌ల గేట్లను ఎత్తివేయటంపై తిరువనంతపురం, పత్తనంతిట్ట జిల్లాల యంత్రాంగాలు ఇరిగేషన్ శాఖ అధికారులను హెచ్చరించాయి. ఇవాళ కూడా ఇదే కొనసాగితే మాత్రం పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వయనాడ్ జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రఖ్యాత పొన్ముడి హిల్ స్టేషన్‌లోకి ప్రవేశాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.

Tags:    

Similar News