Bangalore Rains: వాననీటితో అల్లాడుతున్న బెంగళూరు నగరం
Bangalore Rains: బెంగళూరులో నీటమునిగిన అనేక కాలనీలు
Bangalore Rains: బెంగళూరును మూడు రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలతో బెంగళూరు నగరంలోని అనేక కాలనీలు, వీధులు నీట మునిగాయి. మొన్న కురిసిన వర్షాలతో బెంగళూరు ప్రజలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. అనేక కాలనీల్లో మూడో రోజు కూడా వరదనీరు తగ్గడం లేదు. అసలు వరదనీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో.. ఆయా కాలనీల్లో జనజీవనం స్తంభించింది. పైఅంతస్తుల్లో ఉండే ప్రజలకు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. పైనుంచి కిందికి పాలిథీన్ కవర్లు జారవిడుస్తూ ఆహారం కోసం అర్థిస్తున్నారు. రోడ్ల మీది నుంచి చిన్న వాహనాలు కూడా పోవడానికి వీల్లేకుండా తయారైంది.
స్కూలు పిల్లల్ని వరదనీటిలో దాటించేందుకు ప్రమాదకరమైన స్థితిలో ఓ బుల్డోజర్ సాయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరదనీటిని తోడేయడానికి 1500 కోట్లు కేటాయించామని.. ఆ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై చెప్పారు. లేక్ లను ఆక్రమించుకొని కట్టిన భవనాల కూల్చివేత కోసం మరో 300 కోట్లు కేటాయించామని.. కబ్జాకోరుల విషయంలో తాము మౌనంగా ఉండబోమని బొమ్మై చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి వరదముప్పు రాకుండా చూస్తామన్నారు. వరద ముప్పు లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న బెంగళూరులో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి బొమ్మై అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రజలకు అందాల్సిన సాయంపై అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన సాయం అందేలా చూడాలని ఆదేశించారు.