అస్సాం, మేఘాలయాలో భారీ వర్షాలు
Heavy Rains: *నదులను తలపిస్తున్న రహదారులు *విరిగిపడ్డ కొండచరియలు, రాకపోకలకు ఇబ్బందులు
Heavy Rains: అస్సాంలో అకాల వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యవస్థం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో అస్సాంలోని బరాక్ వ్యాలీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇళ్ళు దెబ్బతినగా చెట్లు నేలకూలాయి. భారీ వర్షాల కారణంగా కటిగోరాహ్‌లోని భారత్ - బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని బలిచెర్రాలోని BSF శిబిరం దెబ్బతింది. అస్సాం - మేఘాలయ సరిహద్దులోని మలిదహార్, చాందీపూర్, మహదేబ్ పూర్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
కటిగోరాహ్‌లోని కలైన్, ధుమ్‌కర్, సాలిగ్రామ్, మౌగ్రామ్ గ్రామాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. కలైం చెర్రా ప్రాంతంలో నదిపై ఉన్న 150 ఏళ్ల నాటి వంతెన దెబ్బతింది. అటు మేఘాలయాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. షిల్లాంగ్- డావ్కీ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిన్షి వద్ద షిల్లాంగ్- నాంగ్‌స్టోయిన్ రోడ్డు.. వరద ముంపునకు గురైంది. అస్సాం- మేఘాలయ సరిహద్దులో ఉన్న జాతీయ రహదారిలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.