కర్ణాటక భారీ వర్షాలు.. ఉడుపిలో మూడు ఫిషింగ్ బోట్లు బోల్తా
శనివారం నుండి కర్ణాటక తీరప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉడిపి మరియు దక్షిణ కన్నడ జిల్లాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదలతో..
శనివారం నుండి కర్ణాటక తీరప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉడిపి మరియు దక్షిణ కన్నడ జిల్లాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదలతో ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తులకు పెద్దఎత్తున నష్టం కలిగింది. ఆదివారం ఉడిపి జిల్లాలోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో ఇళ్లలోని ప్రజలు మిద్దెలెక్కారు. వస్తువులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని మాల్పే ప్రాంతంలో మూడు ఫిషింగ్ బోట్లు బోల్తా పడ్డాయని మత్స్య, ఓడరేవుల శాఖ మంత్రి కోట శ్రీనివాస పూజరీ చెప్పారు. వాటిల్లో 12 మంది మత్స్యకారులు ఉన్నారని.. వారు క్షేమ సమాచారం తెలియాల్సి ఉంది. రెండు ఫిషింగ్ బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి కూడా చెప్పారు.
మరోవైపు మాల్పే, బైరాంపల్లి, కుక్కహల్లి, బైలకేరే , హెరంజే ప్రాంతాలలో ఇళ్లలో చాలా మంది చిక్కుకుపోయారు. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలను తరలించే పనిలో జిల్లా యంత్రాంగం ఉందని మంత్రి తెలిపారు. సహాయక చర్యల కోసం మంగళూరు నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూ బోట్లతో ఉడుపి చేరుకున్నట్లు పూజరి తెలిపారు. ఆదిపది రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.. ఉడుపిలోని కృష్ణ మఠం సమీపంలో పార్కింగ్ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది.. ఉడిపి నగరంలోని బడగుపేట ప్రాంతంలో కొన్ని షాపులు, ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఇక పాడుబిద్రి ప్రాంతంలోని జాతీయ రహదారి 66 (ఉడిపి-మంగళూరు) లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక శంభవి నది నుండి నీరు ఈ నెలలో రెండోసారి దక్షిణా కన్నడలోని ముల్కిలోని బప్పనాడు దుర్గాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోకి వరదనీరు ప్రవేశించింది.