Floods in Maharashtra: వరదలతో వణికిపోతున్న ఉత్తర భారతం
*వరదల కారణంగా నిరాశ్రయులైన వేలాది మంది *మహారాష్ట్ర వ్యాప్తంగా 136 మంది మృతి *రాయ్‌గడ్, సతారా జిల్లాల్లో అత్యధిక మరణాలు
Floods in Maharastra: ఉత్తర భారతంలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదలతో పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రపై వరద బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. గతకొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. నదులకు వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో ఒక్క మహారాష్ట్రలోనే వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
భారీ వరదలకు మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలకు కొంకణ్ తీరం అతలాకుతలమయ్యింది. ముఖ్యంగా రత్నగిరి జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఇక రాయ్‌గడ్, సతారా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. భారీ వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా 136 మంది వరకూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అత్యధికంగా రాయ్‌గడ్, సతారా జిల్లాల్లో ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి.