Helmets: నాణ్యత లేని హెల్మెట్ల పై కేంద్రం కొరడా

Helmets: బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.

Update: 2021-06-13 07:12 GMT

ISI Helmets: (File Image)

Helmets: టూవీలర్ ప్రయాణంలో హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ నిబంధనను పాటించడంలో దాదాపు 70 శాతం మంది అలవాటు పడ్డారు. అప్పటికీ రోడ్లు బాగు చేయకుండా ఈ హెల్మెట్ల నిబంధనలేంటనే విమర్శలూ వచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా ఆ హెల్మెట్లు బీఐఎస్ స్టాండర్డ్ కలిగి ఉండి.. ఐఎస్ఐ మార్కు ఉన్న వాటిని మాత్రమే అమ్మాలనే నిబంధనను జూన్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇక నుంచి ఆ హెల్మెట్లను మాత్రమే అమ్ముతారు. అయితే నార్మల్ హెల్మెట్లను కొన్నవారు.. మార్చి వీటినే ధరించాలనే నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు. వస్తే.. అప్పుడు గాని జనం రోడ్లకు ఏ స్టాండర్డ్స్ ఉన్నాయని ఎదురు తిరిగి ప్రశ్నిస్తారు.

నాణ్యత లేని హెల్మెట్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ ఉన్న ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్) మార్క్ ఉన్న హెల్మెట్లు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జూన్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కొత్త కొత్త నిబంధనలు జారీ చేస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో నాణ్యతతో కూడిన హెల్మెట్లు ఉండకపోవడంతో వాహనదారుల తలకు తీవ్రమైన గాయాలు, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం హెల్మెట్ల విషయంలో నిబంధనలు కఠినతరం చేసింది.

దేశంలో తప్పకుండా బీఐఎస్ గుర్తింపు ఉన్న ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. నాణ్యత లేనటువంటి ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లను, డూప్లికేట్ ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లను వాడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాన్‌ ఐఎస్‌ఐ హెల్మెట్లను తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం లేదా దిగుమతి చేసుకోవడం, వాహనదారులు కొనుగోలు చేయడం వంటివి శిక్షార్హం. ఇలా చేస్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా పడుతుంది. జరిమానానే కాకుండా ఒక ఏడాది పాటు జైలు శిక్ష కూడా పడుతుంది.

Tags:    

Similar News