Gyanvapi Mosque: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక
Gyanvapi Mosque: ఈనెల 21న విచారణ చేపడతామన్న వారణాసి జిల్లా కోర్టు
Gyanvapi Mosque: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసుపై నేడు తీర్పు వెలువడనుంది. ఉదయం 10 గంటలకు అలహాబాద్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్‌ఐ అధికారులు సీల్డ్ కవర్‌లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈనెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపై నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించింది.
సర్వే నివేదిక ప్రతులను ముస్లింపక్షం వారికి కూడా ఏఎస్‌ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లింపక్షం కోర్టులో వేసిన పిటిషన్‌ను తాము సవాల్ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్‌ఐకి పురమాయించింది. మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కుగోడ కింద సర్వే చేయాలని.. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలని.. భవనం రీతిని విశ్లేషించాలని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించడంతో చుక్కెదురయ్యింది. ఏఎస్‌ఐ అధికారులు సకాలంలో సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాల గడువును పొడిగించింది.