GST Loans: జీఎస్టీ రుణాలపై స్పష్టత ఇచ్చిన మంత్రి.. రాష్ట్రాల కొంపముంచిన విధానం

GST Loans: కరోనా పుణ్యమాని ఏర్పడ్డ జీఎస్టీ లోటును భర్తీకి కేంద్రం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేస్తోంది... రాష్ట్రాలే నేరుగా రుణాలు చేసుకుని, వడ్డీ మాత్రమే చెల్లించాలని సూచిస్తోంది. అసలు కేంద్రమే చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించిం

Update: 2020-09-21 02:15 GMT

GST

GST Loans: కరోనా పుణ్యమాని ఏర్పడ్డ జీఎస్టీ లోటును భర్తీకి కేంద్రం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేస్తోంది... రాష్ట్రాలే నేరుగా రుణాలు చేసుకుని, వడ్డీ మాత్రమే చెల్లించాలని సూచిస్తోంది. అసలు కేంద్రమే చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించింది. జీఎస్టీ రుణానికి సంబంధించి అసలు, వడ్డీ మొత్తం కేంద్రమే విడతలవారీగా చెల్లిస్తుంది అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ.. 'ఆయా రాష్ట్రాలు ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని కలుపుకుంటే మొత్తం లోటు రూ. 2,35,000 కోట్లుగా లెక్కించాం. ఈ మొత్తాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి రుణాల ద్వారా పొందడం రెండో ఆప్షన్. ఈ రుణం తిరిగి కేంద్రం చెల్లిస్తుంది. ఈ రుణాలపై వడ్డీని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. రాష్ట్రాలు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం కింద చెల్లించాల్సిన మొత్తం రూ. 4,627 కోట్లు (ఏప్రిల్-జులై మధ్యకాలానికి) చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,424 కోట్లు పరిహారం (ఏప్రిల్-జులై మధ్యకాలానికి) చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్- జులై మధ్యకాలానికి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోయాం. జీఎస్టీ కంపెన్సేషన్ ఫండ్‌ ద్వారా రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తాం. లగ్జరీ వస్తువులపై వేసే సెస్ ద్వారా కంపెన్సేషన్ ఫండ్‌కి నిధులొస్తాయి. జీఎస్టీ కారణంగా నష్టపోతున్న రాష్ట్రాలకు ఆ నిధి నుంచి పరిహారం చెల్లిస్తాం. జీఎస్టీ చట్టం ప్రకారం కంపెన్సేషన్ ఫండ్ నుంచే రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలి.

2017-18 నుంచి 2019-20 వరకు క్రమం తప్పకుండా చెల్లించాం. ఈ ఏడాది కంపెన్సేషన్ ఫండ్‌లో తగినంత బ్యాలెన్స్ లేదు. అందువల్ల రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోయాం. ఈ ఏడాది పరిహారం చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చాం. 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కూలంకుశంగా చర్చించాం. జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తం రూ. 97,000 కోట్లుగా లెక్కించాం. ఆ మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రుణం రూపంలో పొందవచ్చు' అని వివరించారు.

రాష్ట్రాల కొంపముంచిన జీఎస్టీ

'ఒక దేశం, ఒక పన్ను' అన్న సరికొత్త నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పన్ను విధించే అధికారాలను రాష్ట్రాల నుంచి లాక్కోవడం వల్ల దేశంలో సమాఖ్య భారత స్ఫూర్తి దెబ్బతింటుందని, పైగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుందని కొన్ని రాష్ట్రాలు ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయం లోటును ఐదేళ్ల పాటు కేంద్రం భరిస్తుందని, జీఎస్టీ పరిహారం సెస్సు కింద ఈ మొత్తాలను చెల్లిస్తామని, ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం భరోసా కూడా ఇచ్చింది.

2020–21 సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తం అంచనాలకు, వసూళ్లకు మధ్య ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల తేడా వచ్చింది. రాష్ట్రాలకు ఇస్తానన్న పరిహారపు సెస్సు వసూళ్లు 65 వేల కోట్ల రూపాయలను దాట లేదు. అంటే పరిహారపు సెస్సుపోనూ రాష్ట్రాలకు 2.35 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఇదే విషయమమై గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించగా, కేంద్రం ఉచిత సలహాలతో చేతులు దులిపేసుకుంది. పన్నుల ఆదాయం తగ్గిన మొత్తాలకు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాల్సిందిగా కేంద్రం సలహా ఇవ్వడంతో రాష్ట్రాలు బెంబేలెత్తి పోతున్నాయి.

ఆశించిన స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడం, కోవిడ్‌ మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ కారణంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని భర్తీ చేయలేక పోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ పాత పన్నుల విధానాన్నే ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తమిళనాడు ఆది నుంచి నేటి వరకు కూడా జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. జీఎస్టీ పన్ను విధానాన్ని రద్దు చేసి పాత పన్ను విధానాలనే తిరిగి ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పుదుచ్ఛేరి ప్రభుత్వాలు డిమాండ్‌ చేస్తుండగా, జీఎస్టీ వల్ల పెద్దగా నష్టపోని బీహార్, బెంగాల్‌ ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయి. జీఎస్టీ కింద తమ రాష్ట్రానికి దాదాపు 5, 400 కోట్ల రూపాయలు రావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది.

Tags:    

Similar News