Lockdown In India: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కు పెరుగుతోన్న డిమాండ్
Lockdown In India: కరోనా నియంత్రణ కోసం పూర్తి లాక్‌డౌన్ అవసరంపై మరోసారి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Lockdown In India: కరోనా నియంత్రణ కోసం పూర్తి లాక్‌డౌన్ అవసరమా అంటే అవును అనే సమాధానం ఎక్కువ మంది నుండి వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణ కోసం పూర్తి లాక్‌డౌన్ అవసరంపై మరోసారి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ డిమాండ్ పెరిగిపోతుంది.లాక్‌డౌన్‌తో ఆర్థికవ్యవస్థ ఎలా కుప్పకూలిపోతుందో దేశం చూసింది, కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలు ముఖ్యం అంటూ.. పరిశ్రమల నుంచే ఈ డిమాండ్ ముందుగా వస్తుంది.
ఇండియాలో ఏప్రిల్ 5న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా రోజువారీ కేసుల సంఖ్య లక్షను దాటగా, ఆపై 10 రోజుల వ్యవధిలో ఏప్రిల్ 15న రెండు లక్షలకు, మరో వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్ 22న 3 లక్షలకు కేసుల సంఖ్య పెరిగింది. అప్పటి నుంచి రోజుకు సరాసరిన దాదాపు మూడున్నర లక్షల కేసులు వస్తూనే ఉన్నాయి. వీటిల్లో 74 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రతో పాటు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కేరళ, కర్ణాటకల్లో కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది.
ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నా, మిగతా ప్రాంతాల్లో నిబంధనల అమలు లేకపోవడంతో కేసుల సంఖ్య అనుకున్నట్టుగా తగ్గడం లేదు. లాక్ డౌన్ పెట్టాలన్న ఆలోచన చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయమని, పరిస్థితులను అంతవరకూ తీసుకుని వెళ్లకుండా చూడాలనే భావిస్తున్నామని ఉన్నతాధికారులు సూచించారు. మైక్రో కంటెయిన్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నామని, అయితే, కేసుల సంఖ్య పెరుగుతుంటే, కొన్ని వారాల పాటు లాక్ డౌన్ తో మాత్రమే పరిస్థితి చక్కబడుతుందని హెల్త్ నిపుణులు సూచించిన మీదట ఈ సిఫార్సు చేశామని స్పష్టం చేశారు.
దేశంలోని అతిపెద్ద పరిశ్రమల ఛాంబర్, సిఐఐ, దేశంలో సామాన్య ప్రజల బాధలను తగ్గించడానికి ఆర్థిక కార్యకలాపాలను పెద్ద ఎత్తున పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని చిన్న వ్యాపారులు మరియు చిల్లర వ్యాపారుల సంస్థ అయిన CAIT ఇప్పటికే లాక్‌డౌన్‌కు మద్దతు ప్రకటించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) నిర్వహించిన ఒక సర్వేలో 67.5 శాతం మంది ప్రజలు గత సంవత్సరం మాదిరిగానే జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. లాక్‌డౌన్ పెట్టకుండా కరోనా ఆగదని ప్రజలు నమ్ముతున్నారు.