అయోధ్యలో రామ్ మందిరాన్ని నిర్మించేందుకు గాను పనులను ప్రారంభించడానికి మొదటగా ఒక రూపాయి నగదును విరాళంగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బుధవారం (ఫిబ్రవరి 6) శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఈ రూపాయిని అందించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డి ముర్ము ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున ట్రస్ట్‌కు అందించారు.
ఈ ట్రస్ట్ నగదు, విరాళాలు, గ్రాంట్లు, చందాలు, మరియు వ్యక్తులనుంచి సహాయా సహకారాలను ఈ ట్రస్ట్ అంగీకరిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ట్రస్ట్ మొదట్లో సీనియర్ న్యాయవాది కె పరశరన్ నివాసం నుండి పనిచేస్తుంది.. ఆ తరువాత శాశ్వత కార్యాలయాన్ని ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలావుంటే సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ బుధవారం పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ట్రస్ట్ ముగియడానికి సుప్రీంకోర్టు నిర్ణయించిన మూడు నెలల గడువుకు నాలుగు రోజుల ముందు ఈ ప్రకటన చేశారు ప్రధాని. అయోధ్యలోని రామాలయం అభివృద్ధికి ఒక పథకాన్ని సిద్ధం చేసాము అని లోక్ సభకు వెల్లడించారు మోదీ.
ప్రస్తుతం అయోధ్యలో ఉన్న 67.703 ఎకరాల భూమిని ఈ ట్రస్ట్‌కు బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. 'శ్రీ రామ్ జన్మభూమి తీరత్ క్షేత్రం' అని పిలవబడే ఈ ట్రస్ట్ రామ జన్మస్థలం మరియు సంబంధిత విషయాలను సూచిస్తుంది.. అలాగే గొప్ప ఆలయాన్ని నిర్మించటానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ట్రస్ట్ కలిగి ఉంటుందని ప్రధాని మోడీ లోక్సభకు వెల్లడించారు. ఇక ఈ అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని మోదీ ప్రకటించారు.
కాగా అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయం నిర్మాణం కోసం రామ్ లల్లాకు అప్పగిస్తూ గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన సమీక్షను ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కొట్టివేసింది.