Gold Smuggling: ఢిల్లీలో భారీ గోల్డ్ స్మగ్లింగ్.. 504 బంగారు బిస్కెట్ల పట్టివేత
Gold Smuggling: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్‌లో భారీగా బంగారం పట్టుబడింది.
Gold Smuggling: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఈ కేసులో 8 మందిని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుంచి 504 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 83.621 కిలోల బరువు ఉన్న వీటి విలువ దాదాపు రూ.42 కోట్లుగా డీఆర్ఐ అధికారులు అంచనావేస్తున్నారు. మయన్మార్ నుంచి భారత్‌కు తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఇంటెలిజన్స్ అధికారులు పక్కా ప్రణాళికతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు.
నిందితులందరూ నకిలీ గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులతో రైళ్లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారాన్ని ప్రత్యేకంగా కుట్టించిన వస్త్రాల్లో తరలిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. దిబ్రూగఢ్ నుంచి దిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో తరలిస్తుండగా వారిని పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ బంగారు బిస్కెట్లను మయన్మార్ నుంచి మణిపూర్‌లోని మోరే వద్ద అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.