గులాం నబీ ఆజాద్ త్వరలో పదవీ విరమణ

* ఆజాద్‌కు వీడ్కోలు పలికిన రాజ్యసభ సభ్యులు * ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయిన మోడీ * కాంగ్రెస్ నేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మోడీ

Update: 2021-02-10 02:07 GMT

గులాం నబి, నరేంద్ర మోడీ 

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియనుంది. అందుకోసం పెద్దల సభలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. ఆజాద్‌ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో మోడీ ఎమోషనల్‌కి గురయ్యారు.. కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి పోతాయి కానీ, వాటిని ఎలా నిర్వహించాలో గులాం నబీ ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలని మోడీ అన్నారు. ఆజాద్ తనకు గుజరాత్ సీఎం కాకముందు నుంచి తెలుసన్నారు. జమ్మూకశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు తనకు ముందు ఫోన్ చేసింది ఆజాదేనని గుర్తు చేశారు. ఆనాటి ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఎమోషనల్ అయ్యారు కన్నీటి పర్యంతమయ్యారు.

ఆజాద్ సేవలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేత లేరని కొనియాడారు. కేవలం పార్టీ కోసమే కాక, సభ, దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్ అని ప్రశంసలు కురిపించారు. ఆయనను ఎప్పటికీ రిటైర్ అవనివ్వబోమని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని మోడీ తెలిపారు.

తన పదవీ విరమణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆజాద్ వెల్లడించారు. సభలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయాలను మోడీ ఎప్పుడూ వేరు వేరుగా చూస్తారని గుర్తుచేశారు.. సభలో వివిధ అంశాలపై చర్చ సందర్భంగా కొన్నిసార్లు మాటల యుద్ధం కొనసాగేదని.. కానీ, తమ మాటలకు ఎన్నడూ వ్యక్తిగతంగా తీసుకోలేదని గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News