Gehlot govt wins: రాజస్థాన్‌లో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు ముగింపు పడింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్ష నెగ్గారు. బీజేపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై రాజస్థాన్ అసెంబ్లీలో గెహ్లాట్ విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తొలుత సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అధికార, విపక్షాల మధ్య చర్చ వాడీవేడిగా సాగింది. కేంద్ర ప్రభుత్వం డబ్బు, అధికారం ఉపయోగించి మధ్యప్రదేశ్, మణిపూర్ ,గోవాలో ప్రభుత్వాలను పడగొట్టిందన్న మంత్రి అదే మంత్రాన్ని రాజస్థాన్‌లో ప్రయోగించగా బెడిసికొట్టిందని విమర్శలు గుప్పించారు. గెహ్లాట్ నేతృత్వంలోని సర్కార్‌ను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. సచిన్ పైలట్ వర్గీయులు కూడా కలిసి రావడంతో గెహ్లాట్ సర్కారుకు మెజార్టీ నిరూపించుకోవడం సులభమైంది. మరోవైపు అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది.