నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
Lok Sabha Elections 2024: ఫోర్త్ ఫేజ్‌లో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు
Lok Sabha elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా..ఇవాళ నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజైంది. మరి కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఫోర్త్ ఫేజ్‌లో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 13న పోలింగ్...జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటి చేసే అభ్యర్ధులు ఆయా కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్ధి ఏవైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. అభ్యర్థుల నామినేషన్ల విషయానికొస్తే.. 25 వ తేదీ ఉదయం 10 గంటల ముప్పై నిమిషాలకు సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. 22న కొడాలి నాని, బొత్స ఝాన్సీ,బొత్స సత్యనారాయణ, 23న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, 24 న నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు.