Gautam Adani: ఐదో ప్రపంచ కుబేరుడిగా గౌతమ్‌ అదానీ

Gautam Adani: నెంబరు వన్‌గా ఉన్న ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టి మొదటి స్థానానికి గౌతమ్‌ అదానీ

Update: 2022-04-26 07:10 GMT

Gautam Adani: ఐదో ప్రపంచ కుబేరుడిగా గౌతమ్‌ అదానీ

Gautam Adani: అదానీ ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరేమో ఇటీవల బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ నేరుగా వచ్చి అదానీ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీని కలవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఫోకస్‌ అయ్యారు. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే అదానీ మళ్లీ వార్తల్లోకెక్కారు. భూగ్రహంపై ఉన్న కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న ఆయన ఐదో స్థానానికి చేరుకున్నారు. అమెరికా మార్కెట్ల ఒడిదుడుకుల కారణంగా అదానీ ఈ ఘనత సాధించడం విశేషం.

ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ నేరుగా వచ్చి కలవడంతో చర్చనీయాంశంగా మారిన అదానీ గ్రూప్స్‌ చైర్మన్‌ గౌతమ్ అదానీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ 59 ఏళ్ల దిగ్గజ వ్యాపారవేత్త ప్రపంచ కుబేరుల్లో ఐదో వ్యక్తిగా రికార్డులకెక్కారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం లెజండరీ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టి ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నారు. 12వేల 370 కోట్ల డాలర్ల నికర ఆదాయంతో ప్రపంచ కుబేరుల్లో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. దేశంలోనే 10వేల 470 కోట్ల డాలర్ల నికర ఆదాయంతో నెంబరు వన్‌గా ఉన్న ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టి గౌతమ్‌ అదానీ మొదటి స్థానానికి చేరుకున్నారు.

తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో 26వేల 970 కోట్ల డాలర్ల నికర ఆదాయంతో ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తరువాత 17వేల 20 కోట్ల డాలర్లతో ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్‌ రెండో స్థానంలో, 16వేల 790 కోట్ల డాలర్లతో ఫ్రెంచ్‌కు చెందిన విలాసవంతమైన వస్తువల తయారీ సంస్థ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మూడో స్థానంలో, 13వేల 20 కోట్ల డాలర్లతో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ నాలుగో స్థానంలో నిలిచారు. ఐదో స్థానంలో గౌతమ్‌ అదానీ నిలవగా, 12వేల 170 కోట్ల డాలర్లతో వారెన్‌ బఫెట్‌ ఆరోస్థానంలో నిలిచారు. ఇక గౌతమ్‌ అదానీ కంటే ఈ నలుగురు ముందున్నారు. అయితే ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి గౌతమ్‌ అదానీ చేరుకోవడానికి కారణం అమెరికా స్టాక్ మార్కెట్లలో ఒడిడుకులే కారణం. ప్రఖ్యాత పెట్టబడిదారు వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లు రెండు శాతం పడిపోయాయి. దీంతో వారెన్‌ బఫెట్‌ భారీగా నష్టపోయి ఆదాయం పడిపోయింది.

గుజరాత్‌కు చెందిన పోర్టుల వ్యాపారి గౌతమ్‌ అదానీ సంపద, ఆస్తుల విషయంలో అంబానీతో పోటీ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం 11వేల 8వందల డాలర్ల నికర సంపద కలిగిన అదానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో 6వ స్థానంలో ఉన్నారు. కొద్ది రోజుల్లోనే మరో వెయ్యి కోట్ల ఆదాయాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఆయన ఆదాయం 12వేల 370 కోట్ల డాలర్లకు చేరింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌ మిషన్‌ షేర్ల ధరలు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. దీంతో కేవలం కరోనా కాలంలో అదానీ సంపద 53శాతం పెరిగింది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నా అదానీ షేర్లు మాత్రం చెక్కు చెదరలేదు. కరోనా విలయం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాలను దీటుగా ఎదుర్కొని షేర్‌ మార్కెట్లను అదానీ షేర్లు షేక్‌ చేశాయి. దీంతో అదానీ ఆదాయం భారీగా పెరిగింది. అంబానీని సంపద పెరగడంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరారు.

క‌రోనా స‌మ‌యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుప్పకూలాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గౌత‌మ్ అదానీ లాభాల్లో దూసుకెళ్లారు. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ ఆస్తి 261 శాతం పెరిగింది. 2020 హురున్ లిస్టులో అదానీ సంప‌ద లక్షా 40 వేల కోట్ల రూపాయ‌లు ఉండ‌గా కరోనా సమయంలో 5 లక్షల 5వేల కోట్లకు పెరిగింది. ఈ లెక్క‌న చూస్తే కరోనా సమయంలో గౌత‌మ్ అదానీ ఆదాయం రోజుకు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే గంట‌కు ఆదానీ ఆదాయం 42 కోట్లు అన్న‌మాట. ఇక గౌత‌మ్ అదానీ త‌మ్ముడైన వినోద్ శాంతీలాల్ అదానీ సంప‌ద కరోనా సమయంలో ప్ర‌తి గంట‌కు 10 కోట్లు పెరుగుతూ వచ్చింది. కరోనా సమయం నుంచే అదానీ ఆస్తులు భారీగా పెరిగాయి. పునరుత్పాదకత, గ్రీన్‌ హైడ్రోజన్‌, నూతన శక్తి వనరుల్లో భారీగా పెట్టుబడులు పెట్టడంతోనే షేర్లు లాభాల బాట పట్టాయి. దీంతో అదానీ ప్రపంచ కుబేరుడిగా మారారు. 

Tags:    

Similar News