ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లో లక్నో పోలీసు బృందానికి చెందిన కారు బోల్తా పడటంతో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మరణించాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసు సిబ్బందితో సహా నలుగురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని ఎన్‌హెచ్ 26 జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. లక్నో పోలీసులు ముంబై నుంచి తిరిగి వస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ ఫిరోజ్ అలీ అలియాస్ షమ్మీని పట్టుకున్నారు. అయితే లక్నోకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
కాగా లక్నోలోని ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ పాండే, కానిస్టేబుల్ సంజీవ్ సింగ్ గ్యాంగ్‌స్టర్ ను వెతుక్కుంటూ ప్రైవేట్ వాహనంలో ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో ముంబైలోని నాలా సోపారాలో ఫిరోజ్ అలీని శనివారం పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసిన వెంటనే వారు కారులో లక్నోకు బయలుదేరారు. అయితే వీరి వాహనం గునా జిల్లాలో బోల్తా పడటంతో గ్యాంగ్‌స్టర్ అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.