Delhi: ఢిల్లీ రోహిణీ కోర్టు హాల్ లో గ్యాంగ్ వార్
* రెండు గ్యాంగ్ ల మధ్య చాలా కాలంగా వైరం * గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిపై ప్రత్యర్ధుల కాల్పులు * గోగి సహా ముగ్గురి మృతి
Delhi: దేశ రాజధాని ఢిల్లీ అందులోనూ క్రిమినల్ కేసులపై తీర్పునిచ్చే న్యాయస్థానం అలాంటి ప్లేస్‌లోనే కాల్పులు జరిగితే అది కూడా రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగితే.! ఢిల్లీ రోహిణీ కోర్టు రూమ్ 207 సాక్షిగా జరిగిందిదే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను ప్రత్యర్థి గ్యాంగ్ కాల్చి చంపింది. ఒకటీ రెండు కాదు ఈ కాల్పుల ఘటనలో ఏకంగా 40 రౌండ్ల కాల్పులు జరిగాయంటే పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడ్వకేట్ ముసుగులో కోర్టు ఆవరణలోకి వచ్చిన ఇద్దరు దుండగులు గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను కాల్చి చంపారు. రెండు గ్యాంగ్‌లు కాల్పులు జరుపుకోవడంతో జితేందర్‌తో పాటు నలుగురు మృతి చెందారు. న్యాయమూర్తి వద్ద జితేందర్‌ను ప్రవేశపెట్టేందుకు వచ్చిన సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేందర్ తరపు లాయర్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, కోర్టు ఆవరణలో విచక్షణారహితంగా కాల్పులు జరపటంతో సాధారణ వ్యక్తులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ జితేందర్ పై కాల్పుల సమయంలో జితేందర్‌కు రక్షణగా ఉన్న ఢిల్లీ పోలీసులు కూడా కాల్పులు జరపటంతో ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం నలుగురు మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కోర్టుకు వచ్చిన జితేందర్ టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. అడ్వకేట్ యూనిఫామ్స్‌లో వచ్చిన ఇద్దరు ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. 30 ఏళ్ల జితేందర్ గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ (ఎంసీవో సీఏ) కింద అరెస్టు అయ్యారు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేందర్‌పై ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు జరిగిన కాల్పులు సహా గతంలోని అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.