చందమామే వినాయకుని చెంతకు దిగొచ్చిందా ఏకదంతుడే ఏకంగా జాబిల్లి మీదకు వెళ్లాడా భూగోళం బోర్ కొట్టేసి, మూన్ వాక్ కోసం లంబోదరుడు చంద్రమండల టూర్‌కు పయనమయ్యాడా లేదంటే గణేషుడి మురిపెం కోసం మూన్, భూగోళానికే దిగి వచ్చిందా ఏంటీ అసలే చంద్రునికి, వినాయకుడికి పొరపాటున కూడా పడదు, అయినా ఎందుకీ లింకు పెడుతున్నారని ఆలోచిస్తున్నారా అయితే, చవితి రోజు చంద్రుని చూస్తే నీలాపనిందల సామెత మరోసారి గుర్తుకు రావాలంటే, లాల్‌బాగ్చా లంబోదరుడి చంద్రయాన్-2 థీమ్ చూడాల్సిందే.
అపురూపమైన లంబోదరుడి మహా రూపం ఇరువైపులా అంతరిక్షాన్ని శోధించే ఆస్ట్రోనాట్‌లు ఏకదంతుడి వెనక పరిభ్రమిస్తున్న సౌరమండలం చల్లని వెన్నెల్లా చంద్రమండలం. ఖగోళమే వినాయకుడి చెంతకు దిగొచ్చిందా మహాకాయుడే చంద్రమండలంలో చవితి వేడుకలకు ఆసీనుడయ్యాడా అన్న రీతిగా వుంది కదా ఈ అద్భుత దృశ్యం. ఇది ముంబైలోని ప్రఖ్యాత లాల్‌బాగ్చా గణనాథుని మండపం. చంద్రయాన్ థీమ్‌తో, మరోసారి దేశ ప్రజల దృష్టినే ఆకర్షించేలా అలకరించారు.
చంద్రయాన్-2తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది భారత అంతరిక్ష పరిశోధన. చందమామపై మనిషి మనుగడకు అవకాశం ఉందా లేదా అన్న విషయాలను శోధిస్తోంది. ఇప్పటికే అనేక చిత్రాలు పంపించింది చంద్రయాన్-2. దేశ ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించిన చంద్రయాన్-2 థీమ్‌తో, లాల్‌బాగ్చా వినాయక మండపం ముస్తాబైంది. ఫస్ట్‌లుక్‌లోనే లాల్‌బాగ్చా గణపతి, భక్తులను ఇట్టే ఆకట్టుకుంటున్నాడు.
వేదికపై వినాయక ప్రతిమకు ఇరువైపులా ఇద్దరు ఆర్టిఫిషియల్ ఆస్ట్రోనాట్‌లున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో శాటిలైట్ లాంచింగ్ వీడియో క్లిప్. గ్రహాలు, సౌరమండలం మొదలైనవన్నీ కూడా మండపంలో కనువిందు చేస్తున్నాయి.
వినాయక వేడుకలంటే దేశంలో ప్రసిద్ది ముంబై. ఇక్కడ రకరకాల రూపాల్లో, భారీ ఎత్తులో ఏకదంతుడు ఆకట్టుకుంటాడు. అయితే, ముంబైలో అన్ని గణపతి విగ్రహాల కన్నా లాల్‌బాగ్చాలోని వినాయకునికే చాలా ప్రత్యేకత వుంది. అందుకే ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ 20 అడుగుల ఎత్తుగల ప్రతిమను నెలకొల్పారు. రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, ఇలా ఎంతోమంది లాల్ బాగ్చా గణపతిని దర్శించకుంటారు. ఈసారి చంద్రయాన్-2 థీమ్‌తో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శనం కోసం, మునుపెన్నడూలేనంత మంది వస్తారని, నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
తెల్లదొరల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది వినాయక నవరాత్రి ఉత్సవం. మహారాష్ట్ర వేదికగా ఈ మహా సంరంభం మొదలైంది. వినాయక ఉత్సవాలకు ఆద్యుడు లోకమాన్య బాలగంగాధర తిలక్. అందరినీ ఓ చోటకు చేర్చే మహత్తరమైన సందర్భంగా గణేశ్ ఉత్సవాలను మలిచారు. ఇదే స్ఫూర్తితో లాల్‌బాగ్చాలో తొలిసారిగా 1934లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు చంద్రయాన్ థీమ్‌తో ఏర్పాటు చేసిన, లాల్‌బాగ్చా వినాయకుడు, దేశంలోనే సమ్‌థింగ్ అమేజింగ్ గణేషుడిగా, జనాలను ఆకట్టుకుంటున్నాడు.