Gajendra Singh Shekhawat on Water Disputes: ఆగస్టు 5న డిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్రమంత్రి భేటీ..
Gajendra Singh Shekhawat on Water Disputes: తెలుగురాష్ట్రాల నది జలాల సమస్యపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా జలాల పంపకాలపై నెలకొన్న వివాదాలను.. పరిష్కారం దిశగా ముందుకు వెళుతున్నారు కేంద్ర జలశక్తి వనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లతో ఆగస్టు 5వ తేదీన గజేంద్ర సింగ్ షెకావత్ సమావేశం అవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారులకు సమాచారం అందింది. ఇందులో నీటి పంపకాలు, అదనపు ప్రాజెక్టుల గురించి ముఖ్యంగా చర్చ జరగనుంది. తెలుగురాష్ట్రాల నదీ జలాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అఫెక్స్ కౌన్సిల్ సమావేశం జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో జరగనుంది.. ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఎస్ఈ లు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులు అలాగే నీటి కేటాయింపులపై అఫెక్స్ కౌన్సిల్ చర్చించనుంది. 2019 తరువాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక తొలిసారి అఫెక్స్ కౌన్సిల్ భేటీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, తాము మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూనే.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది.