G20 Summit: ముగిసిన జీ20 సదస్సు.. అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్‌కు అప్పగింత
G20 Summit: భద్రతా మండలిలోశాశ్వత సభ్యదేశాల సంఖ్య మారడం లేదు
G20 Summit: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం రెండ్రోజుల పాటు సాగిన జీ20 సదస్సు ముగిసింది. జీ20 సదస్సు రెండో రోజు పలు దేశాధినేతలు, ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం జీ20 అధ్యక్ష అధికార దండాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. మోదీ నుంచి జీ20 గావెల్‌ను తీసుకున్న బ్రెజిల్‌అధ్యక్షుడు సిల్వా.. ప్రధానిపై ప్రశంల వర్షం కురపించారు. కాగా, 2022 డిసెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు జీ20కి ఇండియా అధ్యక్షత వహిస్తుంది. డిసెంబర్1 నుంచే అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్చేతికి వెళ్లనున్నాయి.
ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబరు చివర్లో వర్చువల్ సమావేశం నిర్వహించాలని ఆయన సదస్సులో పాల్గొన్న దేశాధినేతలకు సూచించారు. నవంబరు 30 వరకు జీ-20కి భారత నాయకత్వమే కొనసాగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. బృంద అధ్యక్ష హోదాలో మరో రెండు నెలలు ఉండటం వల్ల మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయొచ్చని ఆయన అభిలషించారు. గత రెండు రోజుల్లో అనేక దేశాలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని.. సూచనలు, ప్రతిపాదనలు చేశాయన్నారు మోడీ. వాటిని నిశితంగా పరిశీలించడం, వేగవంతం చేయడం భారత్ బాధ్యతగా భావిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఐరాస భద్రతా మండలిలోశాశ్వత సభ్యదేశాల సంఖ్య మారడం లేదన్నారు. 51 దేశాలతో ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సమయంలో పరిస్థితులు వేరన్న ఆయన.. ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య రెండు వందలకు చేరువైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కాలానికి అనుగుణంగా ఎవరైతే మార్పుచెందరో.. వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇక సామాజిక భద్రత, ద్రవ్య, ఆర్థిక స్థిరత్వం వంటి వాటికి తోడు ఈసారి క్రిప్టో కరెన్సీ కొత్త అంశంగా తోడైందని మోదీ అన్నారు. క్రిప్టోను నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.