Gujarat CM: గుజరాత్ సీఎం పదవి రేసులో నలుగురు సీనియర్లు
Gujarat CM:ప్రధానంగా వినిపిస్తోన్న నితిన్ పటేల్ పేరు * ఇవాళ గుజరాత్ శాసనసభాపక్ష సమావేశం
Gujarat CM: ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎలాంటి ప్రత్యేకమైన కారణం చెప్పకుండానే సీఎం విజయ్ రూపానీ అకస్మాత్తుగా గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కొత్త నాయకత్వంలో నూతనోత్సాహం, కొత్త శక్తితో గుజరాత్ అభివృద్ధి పథంలో మరింతగా దూసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసే ఉన్నామని విజయ్ రూపాని వెల్లడించారు. అంతేకాదు. మోడీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు.
అయితే ఇప్పుడు కొత్త సీఎం ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండడంతో ఇప్పుడు ఒక్కసారిగా సీఎంను మార్చడంపై సస్పెన్స్‌కు తెరతీసింది. ప్రధాని సొంత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి అంత సానుకూలంగా లేవని, ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందని అధిష్ఠానానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. 2022 డిసెంబరులో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగించి పాలనను సమర్థంగా నిర్వహించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో గుజరాత్ సీఎంగా రూపానీ విఫలం అయినట్టు అధిష్టానం భావించింది. అంతేకాదు.. ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, సీఎం రూపానీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అవి ఢిల్లీ దాకా చేరడంతో సీఎంను మార్చక తప్పలేదని తెలుస్తోంది.
గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ రాజీనామాతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ తరుణంలో కొత్త సీఎం ఎవరనేది చర్చ మొదలైంది. ప్రధానంగా నలుగురు బీజేపీ సీనియర్ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, వ్యవసాయ శాఖమంత్రి ఆర్‌సీ ఫాల్దుతో పాటు కేంద్రమంత్రులుగా ఉన్న పురుషోత్తం రూపాలా, మన్‌సుఖ్ మాండవీయ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇవాళ గుజరాత్ శాసనసభాపక్ష సమావేశం కానుంది. అందులో కొత్త సీఎంను ఎన్నుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
2016 ఆగస్టులో అప్పటి సీఎం ఆనందిబెన్ పటేల్ రాజీనామా చేసిన సందర్భంలో కూడా నితిన్ పటేల్ తదుపరి ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఆఖరి నిమిషంలో విజయ్‌రూపానీకి భాజపా అధిష్ఠానం పగ్గాలు అప్పగించింది. 2016లో ఆనందిబెన్ పటేల్ కూడా ఎన్నికలకు ఏడాది ముందే రాజీనామా చేశారు. సరిగ్గా మళ్లీ అదే తరహాలో విజయ్ రూపానీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంటుండగానే తన సీఎం పదవికి రాజీనామా చేయడం గమనార్హం.