మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జీవిత చరిత్ర

Update: 2020-08-31 12:59 GMT

Pranab Mukherjee Biography: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చి, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌లో వెల్లడించారు.

ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆరోజుల్లో కోల్ కత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సూరి విద్యాసాగర్ కళాశాలలో ప్రణబ్ విద్యాభ్యాసం సాగింది. తరువాత పొలిటికల్ సైన్స్, హిస్టరీలో ఎం.ఎ. పూర్తి చేశారు. అనంతరం కోల్ కత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి డిగ్రీని పొందారు. 1963 లో కోల్ కత్తా లోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో యుడీసీగా ఉద్యోగంలో చేరిన ప్రణబ్ తరువాత విద్యానగర్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా విధులను నిర్వర్తించారు. అతను రాజకీయాలలోనికి రాక పూర్వం దేషెర్ దక్ పత్రికకు జర్నలిస్టుగా పనిచేసారు. 1957 జూలై 13 న ప్రణబ్ సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమర్తె సంతానం.

1969 లో మిడ్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో చేపట్టిన బాధ్యతలతో ప్రణబ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అతని ప్రతిభను గుర్తించి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించింది. అలా 1969 లో భారత పార్లెమెంటులో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. 1973లో తొలిసారిగా ఇందిరా గాంధీ కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం వేగం పుంజుకుంది. అలా ప్రధాన మంత్రి లేని సమయంలో కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి ఎదిగారు.

1984లో రాజీవ్ గాంధీచే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నారు. ప్రణబ్ ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుంచి తొలగించారు.

అనంతరం 1995 నుంచి 1996 వరకు పి. వి. నరసింహారావు కేబినెట్ లో విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టారు. గాంధీ విధేయుడిగా ముఖర్జీ సోనియా గాంధీ రాజకీయ ప్రవేశానికి ప్రధాన పాత్ర పోషించారు. ఆమెకు రాజకీయ గురువుగా బాధ్యతలను చేపట్టారు. 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన తర్వాత ముఖర్జీని భారతదేశ ప్రధానమంత్రిగా చేస్తారని ఊహాగానాలు జరిగాయి. అయితే, సోనియా గాంధీ చివరికి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా నియమించింది. ముఖర్జీ మన్ మోహన్ సింగ్ ప్రభుత్వంలో అనేక ముఖ్య పదవులను చేపట్టారు. రక్షణ, ఆర్థిక, విదేశాంగం వంటి కీలక శాఖలను నిర్వహించారు.

2012 రాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థిగా ఎంపిక కావడంతో క్రియాశీల రాజకీయాల నుంచి ప్రణబ్ తప్పుకొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి పదవీ విరమణ చేసారు. అధికారపార్టీ తరఫున దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి పోటీచేసి విజయం సాధించారు. 2012 జూలై 25న 13వ రాష్ట్రపతిగా పదవిని చేపట్టారు. 2017 జూలై 25 న ప్రణబ్ కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీ కాలం ముగిసింది.

పశ్చిమ బెంగాల్ మిరాఠీ గ్రామంలోని తన పూర్వీకుల గృహంలో పతీ సంవత్సరం ముఖర్జీ దుర్గా పూజను నిర్వహిస్తుంటారు. అక్కడ నాలుగు రోజులు జరిగే ఆచారాలు, పూజల కోసం ప్రణబ్ ప్రతీ ఏడు వెళ్తుంటారు.

రాజకీయ జీవితం

1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక

1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక

1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత

1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా

1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా...

1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..

1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..

1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..

1982-84లో ఆర్థికమంత్రిగా..

1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..

1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా..

1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు

జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక

2004-06లో రక్షణశాఖ మంత్రిగా..

2006-09లో విదేశాంగమంత్రిగా..

2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు

2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News