Dr.Kakarla Subbarao: ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత
Dr.Kakarla Subbarao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్స్ డైరెక్టర్ గా పని చేసిన ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు.
Dr.Kakarla Subbarao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్స్ డైరెక్టర్ గా పని చేసిన ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా పొందారు. 1951లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు.
నిమ్స్ అభివృద్ధికి విశేష కృషి..
1970లో సుబ్బరావు మళ్లీ అమెరికా వెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని అనేక అసుపత్రులలో పనిచేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తొలి అధ్యక్షుడిగా సేవలందించారు. 1986లో ఎన్టీ రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన స్థాయికి నిమ్స్‌ను తీసుకొచ్చారు. 50 ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సత్కారాలు పొందారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు. రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు, జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు రాసిన డాక్టర్ కాకర్ల దేశ.. విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు.