Floods in Delhi: దేశ రాజధానిలో వరదలు.. యమున ఉగ్రరూపం
Floods in Delhi: గత కొన్ని రోజులుగా దేశంలో వరదలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వర్షాల ప్రభావం తాజాగా దేశ రాజధాని ఢిల్లీని తాకింది. ఇక్కడ ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి
Floods in Delhi: గత కొన్ని రోజులుగా దేశంలో వరదలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వర్షాల ప్రభావం తాజాగా దేశ రాజధాని ఢిల్లీని తాకింది. ఇక్కడ ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వీటితో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. ఇలా వరదల వల్ల ఒక పక్క నష్టం వాటిల్లుతుంటే మరోపక్క కాలుష్యం తగ్గి, గాలి నాణ్యత మెరుగుపడటం శుభపరిణామం.
దేశ రాజధాని ఢిల్లీని వరదల ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు తప్పడం లేదు. రిడ్జ్ స్టేషన్‌లో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. పాలం ప్రాంతంలో 35.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లోధీ రోడ్డులో 23.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క ఆగస్టు నెలలోనే ఢిల్లీలో 233.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాలతో పాటు ఈదురుగాలుల ధాటికి మహారాణి బాగ్, శివాజీ పార్క్, సాకేట్ కోర్టు, రాజేందర్ నగర్, మంగోల్‌పురితో పాటు పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేల కూలిపోయాయి. అయితే రాబోయే కొద్ది రోజుల్లో వర్షాల తీవ్రత తగ్గుతుందని ఐఎండీ అంచానా వేసింది. మరోవైపు భారీ వర్షాలతో ఢిల్లీలో కాలుష్యం తగ్గి… గాలి నాణ్యత చాలా వరకు మెరుగుపడింది.
కుండపోత వానల ప్రభావంతో ఢిల్లీలోని యమునా నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయానికి నీటిమట్టం 204 మీటర్లకు పెరిగింది. పాత రైల్వే వంతెన దగ్గర నీటిమట్టం 204.30 మీటర్లగా ఉంది. హర్యానాకు చెందిన హత్నికుండ్ బ్యారేజ్ నుండి ఎక్కువగా నీరు విడుదల కావడంతో యమునా నీటిమట్టం పెరిగింది. శుక్రవారం ఈ బ్యారేజీ నుంచి 11వేల 55 క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. అయితే యమునా నదిలో నీటిమట్టం ప్రమాద స్థాయికి ఒక మీటరు తక్కువగానే ఉంది.
గతేడాది ఆగస్టు 18, 19 తేదీల్లో యమునా నది నీటిమట్టం 206.60 మీటర్లకు చేరింది. ఇప్పుడు కూడా ప్రమాదకర స్థాయికి చేరువలోనే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు, బ్యారేజీల నుంచి అధికంగా నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. ప్రతి నాలుగు గంటలకు బ్యారేజీ నుంచి నీరు విడుదల అవుతోందని, ఈ నీరు యమునా నదిలోకి చేరేందుకు 36 నుంచి 72 గంటల సమయం పడుతుందని తెలిపారు.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మూసివేసిన స్కూళ్లలో వరద బాధితులకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.