Maharashtra: కోవిడ్ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం...నలుగురు రోగులు సజీవదహనం
Maharashtra: థానేలో బుధవారం తెల్లవారుజామున కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి నలుగురు సజీవదహనం అయ్యారు.
Maharashtra: అసలే కరోనా తో అల్లాడుతుంటే అసుపత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటూ అగ్నికి ఆహుతి కావడం ఒకింత ఆందోళన కరమే. తాజాగా మహారాష్ట్రలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. థానేలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రోగులు సజీవ దహనమయ్యారు. థానేలోని ప్రైమ్ క్రిటికేర్ ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఆసుపత్రిలో మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం చోటుచేసుకుందని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారి వెల్లడించారు.
ఇదేక్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులతో పాటు ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందని మున్సిపల్ అధికారి వెల్లడించారు. ఇటీవల రెండ్రోజుల క్రితం కూడా థానేలోని వేదాంత్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఐదుగురు కొవిడ్ బాధితులు మరణించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనప్పటి అనేక అంశాల్లో ఇండియా డొల్లతనం కనపడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.