మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే దిశగా కేంద్రం!

Update: 2020-05-12 05:49 GMT

దేశ ఆర్థిక వృద్ధిరేటు పురోగమనం వైపు మళ్ళించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా?.. అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తితో సంక్షోభంలో కూరుకుపోయిన ఎకానమీలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. అమెరికా జపాన్‌ల ఆర్థిక వ్యవస్ధలు భారత్‌ కంటే పెద్దవి అయినందునే భారీ ప్యాకేజ్‌లు ప్రకటించాయని గడ్కరీ తెలిపారు . ఈఎంఐల చెల్లింపుపై ఆర్‌బీఐ మూడు నెలల మారటోరియం విధించినా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నందున కేంద్ర ప్యాకేజ్‌ అనివార్యమని నితీన్ గడ్కరీ స్పష్టం చేశారు.

తెలంగాణ పరిశ్రమ సంస్థతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తుందని,అయితే ప్రభుత్వానికి ఉన్న పరిమితులను అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావానికి లోనైన ప్రతి ఒక్కరినీ కాపాడేందుకు తాము చేయగలిగినంతా చేస్తున్నామని గడ్కరీ వెల్లడించారు.

కరోనా వైరస్ ప్రభావితమైన వారికి ఊరటగా ఆర్‌బీఐ మార్చి 27న మూడునెలల పాటు ఈఎంఐ చెల్లింపులను నిలుపుదల చేస్తూ ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఆదాయపన్ను, జీఎస్టీ రిఫండ్‌లను తక్షణమే ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించానని తెలిపారు. పరిశ్రమకు చేయూత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ప్యాకేజ్‌ను ప్రకటిస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు.

Tags:    

Similar News