Farm Laws: రాజ్‌భవన్‌ల ముట్టడికి రైతు సంఘాల నిర్ణయం
Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలు రాజ్‌భవన్‌ల ముట్టడికి పిలుపునిచ్చాయి.
Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలు రాజ్‌భవన్‌ల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈనెల 26తో ఆందోళనలకు ఏడు నెలలు పూర్తవుతుండటంతో ఆరోజు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నాయి రైతు సంఘాలు. తమకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌ల ముందు రైతులు నల్లజెండాలతో నిరసనలు తెలపాలని సంయుక్త్ కిసాన్ మోర్చా నేత రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు.
కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు గతేడాది నవంబరు 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం సుప్రీంకోర్టుకు చేరడంతో సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. నూతన చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రతిపాదించగా పూర్తిగా రద్దు చేయాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు.