ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల నిరసన కొనసాగుతోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈరోజు మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపనుంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వం రైతులకు ప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ రైతు సంఘాలు తమకు కొత్త చట్టాలు వద్దే వద్దని తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నాయి.
ముగ్గురు సీనియర్ కేంద్ర మంత్రులతో 35 రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. రైతులు లేవననెత్తిన అన్ని అంశాల అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు అసాధ్యమని కేంద్రం తేల్చిచెప్పింది. ఇటు చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆపమని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
మూడు సాగు చట్టాల్లో ఉన్న అంశాలపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అంశాలపై రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం ఈరోజు నాలుగో విడత చర్చలు జరుపనుంది. అయితే ఈరోజు జరగబోయే చర్చలపై రైతు సంఘాలు సమీక్షించాయి. చర్చల్లో ఏ విషయాలను ప్రస్థావించాలో చర్చించుకున్నారు. ఇటు హోంశాఖ మంత్రి అమిత్‌షా నివాసంలో కూడా కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. రైతులకు ఎలా నచ్చచెప్పాలనే అంశంపై సుధీర్ఘంగా మాట్లాడుకున్నారు.
కనీస మద్దతు ధర వ్యవసాయ చట్టంలో భాగమే కాదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ చెబుతున్నారు. ఈ విషయంలో రైతులకు అనుమానాలు, అపోహాలు అవసరం లేదని వివరించారు. ఇదిలా ఉండగా ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం కానున్నారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నది ఎక్కువగా పంజాబీ రైతు నేతలే కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.