Farmers Protest: రైతులతో కేంద్రం మరోసారి చర్చలు..ఫలితం ఉండేనా?
* ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన * నేడు తొమ్మిదో దఫా చర్చలు * చర్చలపై ఆశ లేదని రైతుల వెల్లడి
నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. కేంద్రం ఇప్పటికే ఎనిమిది విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాలు రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని గత సమావేశాల్లో డిమాండ్ చేశారు. ఈ రోజు రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిదో దఫా చర్చలు జరగనున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ కమిటీ వేసింది. దీంతో ఇవాళ జరగనున్న తొమ్మిదోసారి జరగనున్న చర్చలపై ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర చట్టాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తొలి సమావేశం కూడా ఈ నెల 19న జరుగనుంది.
తొమ్మిదో విడుత చర్చల్లోనూ చెప్పుకోదగిన పురోగతి ఉంటుందనే ఆశ తమకు లేదని రైతు సంఘాల నేతలు చెప్పారు. ప్రతీసారి లాగానే కేంద్రంతో చర్చలు జరిగే అవకాశముందని తెలిపారు. చర్చల్లో ఎలాంటి ఫలితం రాకపోవచ్చని స్పష్టంచేశారు. ఇదిలాఉంటే.. జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున కిసాన్ రిపబ్లిక్ పరేడ్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. ఈ చట్టాల్లో సవరణలు మాత్రం చేస్తామని రద్దు చేసేదిలేదంటూ కేంద్రం పేర్కొంటోంది.