రైతులతో కేంద్రం పదో రౌండ్ చర్చలు రేపటికి వాయిదా
* ఏదో ఒకటి తేల్చెయ్యాలని ప్రభుత్వం తర్జనభర్జన * రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలని రైతుల నిర్ణయం * ర్యాలీని అడ్డుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు * దేశరాజధానికి భంగమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఢిల్లీ పోలీసులు
సాగు చట్టాలపై రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకూ మధ్య నేడు జరగాల్సిన పదో రౌండు చర్చలు రేపటికి వాయిదాపడ్డాయి. రేపు మధ్యాహ్నం రెండుగంటలకు విజ్ఞాన్‌భవన్‌లో జరుగుతాయని వ్యవసాయశాఖ ప్రకటించింది. పరిష్కారం దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు అంతర్గత సమాలోచనల కోసమే వాయిదా వేశారని తెలుస్తోంది.
రిపబ్లిక్ వేడుకుల దృష్ట్యా ఈ చర్చలు కీలకమని రెండు వర్గాలు భావిస్తున్నాయి. అదే రోజున ట్రాక్టర్లతో ర్యాలీ జరపాలని రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈర్యాలీని అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోంది. రిపబ్లిక్ వేడుకలను భగ్నం చేసేలా జరిపే ఈ ర్యాలీ వల్ల దేశ గౌరవానికి భంగం కలుగుతుందని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ర్యాలీకి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాల్సింది పోలీసు యంత్రాంగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి అధికారాలేంటో.. ఎలా వినియోగించుకోవాలో కోర్టు చెప్పాలా.. అంటూ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.