విజ్ఞాన్ భవన్‌లో రైతుసంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు రైతు సంఘాల నేతలు పట్టు పడుతున్నారు. అలాగే కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికే ఎనిమిది విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు.
సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాలు రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని గత సమావేశాల్లో డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున కిసాన్ రిపబ్లిక్ పరేడ్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా ఈ చట్టాల్లో సవరణలు మాత్రం చేస్తామని రద్దు చేసేదిలేదంటూ కేంద్రం స్పష్టం చేసింది.