పదో రోజుకు చేరుకున్న రైతుల నిరసన.. గజ గజ వణికించే చలిలోనే నిద్రిస్తున్న రైతన్నలు
ఒకటే నినాదం. ఒకటే పట్టు చలిని సైతం లెక్క చేయడం లేదు తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదంటూ కూర్చున్నారు. ఎముకలు కొరికే చలిలో తాము వణకకుండా దేశ రాజధానిని రైతులు గజగజ వణికిస్తున్నారు. చలిలోనే నిద్రిస్తున్నారు. అక్కడే వండుకొని తింటున్నారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న శాంతియుత ఆందోళన పదో రోజుకు చేరుకుంది. అన్నదతలకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేపడుతున్నారు.
కేంద్రంతో రైతుల సంఘాలు రెండు సార్లు చర్చలు జరిపినప్పటికీ రైతులకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి సానుకూలంగా రాకపోవడందో ఈ నెల 8న భారత్ బంద్ పాటించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళనతో ఢిల్లీ వచ్చే సింఘూ, టిక్రి, గాజీపూర్, నోయిడా సరిహద్దుల దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
దేశ రాజధాని సరిహద్దులో అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రైతుల నిరసనతో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఇవాళ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. ఈ చర్చల్లో ఏదో ఒకటి తేలవచ్చన్న టాక్ వినిపిస్తోంది.