Farmers Protests: ఢిల్లీ-హర్యానా బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితి.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Farmers marching to Delhi leads to hgh tension at Delhi - Haryana border: ఛలో ఢిల్లీ పేరుతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు చేపట్టిన ఆందోళనతో ఢిల్లీ - హర్యానా బార్డర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా హర్యానాలోని అంబాల జిల్లా నుండి ఢిల్లీకి దారితీసే శంభు బార్డర్ వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేపట్టారు. కానీ వారిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు కూడా భారీ బందోబస్తుతో గట్టి ఏర్పాట్లు చేశారు.
శంభు బార్డర్ వద్ద పెద్ద పెద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున బారీకేడ్స్ పెట్టారు. ఇవే కాకుండా ఎత్తైన సిమెంట్ దిమ్మెలు కూడా అడ్డంగా పెట్టారు. ఇవన్నీ దాటుకుని వచ్చే వారిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. అయినప్పటికీ, శంభు బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బారికేడ్స్‌ని రైతులు పడదోసుకుని ఢిల్లీ వైపు ముందుకు వెళ్లారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇనుప కంచెలు దాటుకుని వెళ్లిన రైతులు సిమెంట్ దిమ్మెలు లాంటి జెర్సీ బారీకేడ్స్ వద్ద ఆగిపోయారు.
రైతుల ప్రధాన డిమాండ్స్ ఏంటంటే..
* తాము పండించే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం లీగల్ గ్యారెంటీ విడుదల చేయాలనేది రైతుల డిమాండ్స్‌లో ఒకటిగా ఉంది.
* రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలి.
* రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
* వ్యవసాయ కూలీలకు కూడా పెన్షన్ అందించాలి.
* 2021 నాటి లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనల్లో బాధితులకు న్యాయం
* 2020-21 నాటి ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలనేది రైతుల ప్రధానమైన డిమాండ్స్‌గా ఉన్నాయి.