ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఉద్యమం

* నేడు రైతు సంఘాల నేతల కీలక సమావేశం * కేంద్రంతో చర్చలు పున:రుద్దరించే అంశంపై చర్చ * రెండు, మూడురోజుల్లో రైతులతో చర్చిస్తామంటున్న కేంద్రం * ఆరునెలలైనా పోరాటం చేస్తామంటున్న అన్నదాతలు

Update: 2020-12-26 03:15 GMT

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే చట్టాలపై చర్చించేందుకు కేంద్రం మరోసారి రైతు సంఘాలకు లేఖ రాసింది. దీంతో రైతు సంఘాల నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. ఇదే అంశంపై ఇవాళ మరోసారి సమావేశమై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

వచ్చే రెండు, మూడు రోజుల్లో రైతులతో తదుపరి చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయంటున్నారు అధికారులు. అయితే కనీస మద్దతు ధర ఈ చట్టాల పరిధిలో లేదని.. చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. ఇక చర్చలకు కొన్ని యూనియన్లు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక ప్రభుత్వం పంపిన ఆహ్వానాల్లో ఎలాంటి ప్రతిపాదనలూ లేవంటున్న రైతు సంఘాలు.. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతున్నాయి. మరోవైపు ఎలాగైనా సరే ప్రభుత్వంతో తేల్చుకోవాలని సంఘాలు భావిస్తున్నాయి. కాగా.. రైతుల ఆందోళన ప్రారంభమై 30రోజులు గడిచిపోయాయి.

సింఘూ, టిక్రీ సరిహద్దుల దగ్గర మొదలైన ఈనిరసనను అదే స్ఫూర్తితో రైతు సంఘాలు 4డిగ్రీల చలిలో కొనసాగిస్తున్నాయి. అయితే రోజురోజుకూ వందల మంది వచ్చి చేరుతున్నారు తప్ప ఎవరూ వైదొలగలడం లేదు. ఇక ఆరునెలలైనా పోరాటం కొనసాగించడానికి సిద్ధపడే వచ్చామని స్పష్టం చేస్తున్నారు.

ఇక ప్రభుత్వం దిగిరాకపోతే రిపబ్లిక్‌ డే రోజు రైతులు తమ ట్రాక్టర్లను, ట్రాలీలను రాజ్‌పథ్‌కు నడిపిస్తారని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ హెచ్చరించారు. తమ పరేడ్‌ను చూశాకైనా ప్రభుత్వానికి అర్థమవుతోందని.. ఎవరు నిజమైన రైతులో..? ఎవరు ఖలిస్థానీలో..? ఎవరు ఎవరికి దాసోహమంటున్నారో.. తేలిపోతుందన్నారు.

Tags:    

Similar News