ఇవాళ కేంద్రంతో రైతు సంఘాల చర్చలు

* కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు * కొత్త సాగు చట్టాల రద్దుపై చర్చించాలన్న రైతులు * నాలుగు ప్రతిపాదనలు చర్చలో ఉండాల్సిందే: రైతులు

Update: 2020-12-30 01:30 GMT

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్లపైనే బైఠాయించిన రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చర్చలకు రావాల్సిందిగా కేంద్రం... రైతులకు ఆహ్వానం పలికింది. కేంద్రంతో భేటీ కావడానికి రైతు సంఘాల నాయకులు అంగీకరించారు. ఇవాళ కేంద్రం-రైతుల మధ్య జరిగే ఆరో దఫా చర్చలకు ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ వేదికగా కానుంది.

ప్రభుత్వంతో చర్చలకు అంగీకారం తెలుపుతూ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ రాసింది. నాలుగు అంశాలే అజెండాగా చర్చలకు హాజరవుతున్నట్లు రైతు నేతలు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దిశగా విధానాల రూపకల్పన, పంటకు కనీస మద్దతు ధర హామీకి చట్టబద్దత, ఢిల్లీలో గాలి నాణ్యత ఆర్డినెన్స్ లో రైతులకు మినహాయింపు, విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరణ అనే నాలుగు ప్రతిపాదనల విషయంలో తాము పట్టు సడలించబోమని రైతులు స్పష్టం చేశారు. తాము సూచించిన ప్రతిపాదనలు చర్చలో ఉండాలని లేఖలో వెల్లడించారు.

ఇప్పటివరకు ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టగా.. సవరణలు తెస్తామని కేంద్రం చెబుతోంది. దీంతో ఇవాళ చర్చల్లో ఫలితం సానుకూలంగా వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది.


Full View


Tags:    

Similar News