కాశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదుల ఏరివేత.. ఇప్పటివరకు 88 మంది ఎన్‌కౌంటర్
జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన తుపాకీ పోరులో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి.
జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన తుపాకీ పోరులో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. వీరు శనివారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. దీంతో గత 13 రోజుల్లో 8 ఎన్‌కౌంటర్లు జరిగినట్టయింది. నిపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించాయి, అయితే ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
అనంతరం ఎన్‌కౌంటర్ స్పాట్ నుంచి ఉగ్రవాదుల మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) , స్థానిక పోలీసులు అర్ధరాత్రి సమయంలో ప్రారంభించిన ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. ఈ ఏడాది జరిపిన 36 ఆపరేషన్లలో 88 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.