Bengal Elections 2021: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
Bengal Elections 2021: నందిగ్రామ్ నియోజకవర్గ వ్యాప్తంగా నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదని ఈసీ ఆదేశం
Bengal Elections 2021: సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నందిగ్రామ్సైతం ఉండగా.. తుది ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి బంగాల్సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి, మహా కూటమి నుంచి సీపీఎం నేత మీనాక్షి ముఖర్జీ పోటీపడుతున్నారు. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగించాయి.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పోలింగ్ రోజున వర్తించే నిషేధాజ్ఞలకు అదనంగా పకడ్బందీ నిఘా, భద్రతకు ఉపక్రమించింది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి తలపడుతోన్న నందిగ్రామ్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నందిగ్రామ్ నియోజకవర్గ వ్యాప్తంగా నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదని ఈసీ ఆదేశించింది. మరోవైపు హెలికాప్టర్లతో నిఘా పెంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ దృష్ట్యా ఈ ప్రాంతంలో 22 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు కూడా భారీగా మోహరించారు. నియోజకవర్గానికి వచ్చే అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బయటి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.