బెంగాల్, ఒడిశాలో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం

* ఈ నెల 30న బెంగాల్‌లోని భవానీపూర్, జంగీపూర్ శంషేర్‌గంజ్‌ స్థానాకులు ఎన్నికలు

Update: 2021-09-04 13:15 GMT

ఎన్నికల సంఘం  

Election Commission: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం కుర్చీలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఉప ఎన్నికకు నగారా మోగింది. భవానీపూర్‌ ఉప ఎన్నికతో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ స్థానాలతో పాటు ఒడిశాలోని ఒక స్థానానికి కూడా ఎన్నికలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 30న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో దీదీ భవానీపూర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.

భవానీపూర్ ఉప ఎన్నిక సహా శంషేర్‌గంజ్, జంగీపూర్ అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెప్టెంబరు 30న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 13వరకు గడువు కల్పించింది. అక్టోబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు సీఈసీ వెల్లడించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్టు తెలిపింది. బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరాల మేరకు భవానీపూర్‌తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెలలో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. పోలింగ్ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తామని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మరో 31 నియోజకవర్గాల ఉప ఎన్నికలను కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసినట్టు తెలిపింది. పండుగల తర్వాత వాటికి ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. దాంతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీదీ సీఎం కుర్చీలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా మళ్లీ అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. అయితే ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే భవానీపూర్ స్థానానికి తృణమూల్ నేత సోభాందేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఇప్పుడు దీదీ ఆ సిట్టింగ్ స్థానంలో పోటీచేయనున్నారు.

మరోవైపు టీఎంసీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. బెంగాల్‌లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి షాకిస్తూ తృణమూల్ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్, విశ్వజిత్ దాస్‌లు బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా కలియగంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సౌమెన్ రాయ్ కూడా బీజేపీకి బైబై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Tags:    

Similar News