Breaking News: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్- సీఈసీ
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరపనున్నట్లు సీఈసీ తెలిపారు. మార్చి 10న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇక మణిపూర్ రాష్ట్రానికి ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
యూపీలో 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలేనని సీఈసీ అన్నారు. కొవిడ్ రహిత పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఓటర్లతో పాటు సిబ్బందిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 18.34కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు సీఈసీ తెలిపారు. ఇందులో 8.55కోట్ల మంది మహిళా ఓటర్లు, 24.9లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను 16శాతం పెంచామన్నారు. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచుతున్నట్లు వివరించారు. ఇక పోలింగ్ విధుల్లో పాల్గొనేవారికి ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణించి వారికి కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని కేంద్రాన్ని సూచించారు.