నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే.. 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉపఎన్నికలు జరగనున్నాయి. కరోనా నేపధ్యంలో పోలింగ్ సమయాన్ని గంట పెంచినట్లు సీఈసీ సునీల్ ఆరోరా ప్రకటించారు.
మరోవైపు.. 2021జనవరిలోనే ఓటర్లజాబితా సిద్ధం చేశామన్నారు. 18.68 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. బెంగాల్‌లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను 31.65 శాతానికి పెంచుతున్నట్లు సీఈసీ వివరించారు. ఇక.. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో 234, పశ్చిబెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు సునీల్ ఆరోరా వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా సంక్షోభ సమయంలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వివరించారు.
మరోవైపు.. పోలింగ్ సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తిస్తామన్న సీఈసీ.. పోలింగ్ అధికారులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నింబధనలకు లోబడే రోడ్ షోలకు అనుమతి ఉంటుందన్న సీఈసీ సునీల్ ఆరోరా.. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అటు.. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు సీఈసీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని సునీల్ ఆరోరా స్పష్టం చేశారు.
అసోం
మూడు విడతల్లో 126 స్థానాలకు ఎన్నికలు. మార్చి 27వ తేదీన తొలి విడత పోలింగ్ (47 అసెంబ్లీ స్థానాలు). ఏప్రిల్ 1, 6వ తేదీల్లో రెండు, మూడో విడతలకు ఎన్నికలు.
తమిళనాడు
234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్
కేరళ
140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ఏప్రిల్ 6వ తేదీన ఎన్నిక.
పశ్చిమ బెంగాల్
294 స్థానాలతో అతిపెద్ద అసెంబ్లీగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 పోలింగ్ చేపట్టనున్నారు.
పుదుచ్చేరి
30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్.
మొత్తం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు.